ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం: కవిత

ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం: కవిత

తెలంగాణలో ఇంటర్మీడియేట్ బోర్డు రద్దు ప్రతిపాదనపై రాజకీయంగా, విద్యారంగంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఇంటర్మీడియేట్ బోర్డును ఏకపక్ష నిర్ణయాలతో రద్దు చేస్తామంటే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకురావాలంటే మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించాలని సూచించారు.

ముఖ్యమంత్రి డ్రాప్ అవుట్లను కారణంగా చూపుతూ ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని సమర్థించడం సరికాదని కవిత అన్నారు. డ్రాప్ అవుట్లకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు తప్పుగా ఉన్నాయని విమర్శించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియేట్‌లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యపై ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కలు మొత్తం విద్యార్థుల పరిస్థితిని ప్రతిబింబించడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే డ్రాప్ అవుట్ల శాతం 16 శాతంగానే ఉందనిన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆ తర్వాత ప్రైవేట్ విద్యాసంస్థల్లోనో, ఇతర కోర్సుల్లోనో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు విద్యకు దూరమవుతుంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. డ్రాప్ అవుట్లకు ఆర్థిక ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల కొరత వంటి అనేక కారణాలున్నాయని చెప్పారు. ముఖ్యంగా పేదరికమే విద్యార్థులు చదువు మానేయడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

డ్రాప్ అవుట్ల సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న నమో లక్ష్మి పథకాన్ని కవిత ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా విద్యార్థినుల విద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ఇలాంటి పథకాలను తెలంగాణలోనూ అమలు చేస్తే డ్రాప్ అవుట్ల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు.

పదో తరగతి నుంచి ఇంటర్మీడియేట్‌కు వెళ్లే విద్యార్థినుల సంఖ్యపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా కవిత తప్పుబట్టారు. తన వద్ద ఉన్న గణాంకాల ప్రకారం బాలికల నమోదు శాతం 77.4 ఉండగా, బాలుర నమోదు శాతం 68.4గా ఉందన్నారు. బాలుర విద్యపై ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాలురలో పరీక్షల్లో వైఫల్యాలు, గంజాయి వినియోగం, చదువుపై నిర్లక్ష్యం వంటి సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.

అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్‌గా భావించకూడదని కవిత హితవు పలికారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు డ్రాప్ అవుట్లు లేకుండా విద్యార్థులను కొనసాగించడంలో తెలంగాణ టాప్-5లో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య విషయంలో 28వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేవలం పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడ్డారు.

ALSO READ : గ్లోబల్ సమ్మిట్ ను వాయిదా వేయండి..?

ఇంటర్మీడియేట్ బోర్డు రద్దు నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని కవిత స్పష్టం చేశారు. అయితే ఇలాంటి కీలకమైన మార్పులు అమలు చేయడానికి కనీసం 3 నుంచి 10 ఏళ్ల సమయం పట్టే ప్రక్రియ అవసరమని అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా, విధానపరంగా పూర్తి మద్దతు అందించాలని కోరారు.విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలంటే అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తే అంగీకరించబోమని కవిత స్పష్టం చేశారు.